Sri Ram Navami Celebrations Across the State: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్రాలన్నీ రామనామంతో మార్మోగాయి. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభ వీరాజిల్లింది. దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశాఖ అంబికాబాగ్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.
అనకాపల్లి జిల్లాలోని పెద్ద రామస్వామి, చిన్నరామస్వామి కోవెల, విజయరామరాజుపేట, నర్సింగరావుపేట, పూడిమడకలో నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కోనసీమ జిల్లా పి. గన్నవరంలోని రాములవారి ఆలయంలో పాలకోవా పదార్థాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలోశ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
కాషాయ జెండాలతో శోభాయాత్ర: గుంటూరులో కాషాయ జెండాలతో వైభవంగా శోభాయాత్ర జరిగింది. బృందావన్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన వాహన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంలోని కోదండ రామస్వామి ఆలయంలో నవమి వేడుకలు వైభవంగా జరిగాయి.
కన్నులపండువగా కల్యాణం: విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీరామనవమి పురస్కరించుకుని ధర్మపథం కల్యాణవేదిక వద్ద సీతారాముల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. విజయవాడలోని బీసెంట్ రోడ్డులో శ్రీరామనవమి వేడుకల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొని... స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల, చినగంజాం, పర్చూరు, మార్టూరులో చలువ పందిళ్లలో నవమి వేడుకలు వైభవంగా జరిగాయి.
పురాతన రాంబొట్ల దేవాలయంలో: కర్నూలు పాతబస్తీలోని పురాతన రాంబొట్ల దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని వేద పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్ పేట సాయిబాబా ఆలయంలో మాజీ మంత్రి శిధ్ధా రాఘవరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల సంజీవనగర్‌లోని రామాలయంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా సీతారాముల కల్యాణం: కడపలో శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట, శ్రీకాళహస్తీశ్వరలయానికి అనుబంధంగా ఉన్న పట్టాభి రామాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కోదండరామస్వామి ఆలయంలో నవమి వేడుకల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. అనంతపురంలో శోభాయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాషాయ కండువాలు, జెండాలు ధరించి నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
ఇవీ చదవండి: