ప్రజలు కొవిడ్ నుంచి రక్షించుకునేందుకు ఆహారంలో సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫలితంగా వీటి వాడకం బాగా పెరిగింది. ఈ పరిస్థితులు మన దేశంలో పండే సుగంధ ద్రవ్యాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడేలా చేశాయి. పసుపు, అల్లం, మిరియాలు, యాలకులు, పుదీనా వంటి సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. ఇక మిర్చి ఎగుమతుల్లోనూ మంచి వృద్ధిరేటు నమోదైంది.
ఊపందుకున్న ఎగుమతులు
సుగంధ ద్రవ్యాలను ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా పండిస్తున్నారు. కరోనా ప్రారంభ దశలో దేశాల మధ్య రవాణా నిలిచిపోవటంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. పరిస్థితులు తిరిగి పుంజుకున్నాక ఎగుమతులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనాడా, ఆస్ట్రేలియా, యూఏఈ, ఇరాన్, సింగపూర్, చైనా, బంగ్లాదేశ్‌లకు ప్రధానంగా ఎగుమతి అవుతున్నాయి.
పెరిగిన సుగంధ ద్రవ్యాల వాడకం
2019లో 8లక్షల 94వేల టన్నులు, 2020లో 11లక్షల 26వేల టన్నులు విదేశాలకు వెళ్లాయి. అన్ని రకాల దినుసుల ఎగుమతులు 26 శాతం మేర పెరిగాయని గుంటూరులోని సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారులు చెబుతున్నారు. విలువ పరంగా చూస్తే 20 శాతం మేర వృద్ధి నమోదైందని వివరించారు. 2019లో 16వేల 601 కోట్లు కాగా.. 2020లో 19వేల 740కోట్ల రూపాయల విలువ చేసే సుగంధ ద్రవ్యాలు ఎగుమతయ్యాయి. వీటిలో మన రాష్ట్రంలో విస్తారంగా పండే మిర్చి, పసుపు ఎక్కువగా ఉన్నాయి.
నాణ్యతా పరీక్షలు
మసాలా దినుసుల ఎగుమతికి సంబంధించి నాణ్యతా పరీక్షలు కూడా సుగంధ ద్రవ్యాల బోర్డు నిర్వహిస్తుంది. గుంటూరులోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించి... ఎగుమతులకు అనుమతిస్తారు.
ఇదీ చదవండి: