సంగీత స్వరాలు సరిచేస్తున్న ఈ యువకుడు పవన్ శ్రీ. స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. ఇంటర్ తర్వాత ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో చేరినా...అది పూర్తవ్వకముందే మల్టీమీడియాలో చేరాడు. అభిరుచికి చదువుతో సంబంధం లేదని నిరూపిస్తూ సంగీత రంగలోకి అడుగుపెట్టాడు.
సందేశాత్మక లఘుచిత్రాలకు సంగీతం..
కర్ణాటక సంగీతం నేర్చుకున్న పవన్ వివిధ వాయిద్య పరికరాలపై పట్టు సాధించాడు. ఈ క్రమంలోనే స్వరకర్తగా మారి లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహారిస్తున్నాడు. ఇప్పటి వరకూ పదికిపైగా చిత్రాలకు స్వరాలు అందించిన పవన్, స్నేహితులతో కలిసి వందేమాతరం, జైహింద్ వంటి దేశభక్తి పాటలు పాడాడు.
సామాజిక సందేశాలు ఇతివృత్తంగా ఉండే లఘుచిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు పవన్. ఏజీఎన్, అన్నా, లవ్ మిస్సింగ్, కుయ్యోమొర్రో వంటి లఘు చిత్రాలకు సంగీతం అందించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రైవేట్ ఆల్బమ్‌లకు కూడా సంగీతమందించి శభాష్ అనిపించుకున్నాడు పవన్. ప్రస్తుతం బావ యాడున్నాడో ఆల్బమ్ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రతిభావంతులకు ప్రోత్సాహం...
ఇంట్లోనే చిన్నపాటి రికార్డింగ్ థియేటర్ ఏర్పాటు చేసుకుని...ఔత్సాహికులైన గాయనీ గాయకులు ప్రోత్సహిస్తున్నాడు పవన్. బాపట్లలో స్డూడియో ఏర్పాటు చేసి, తద్వారా స్థానికంగా ఉన్న ప్రతిభావంతులను పోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు పవన్.
సినిమా అవకాశం...
ఈ క్రమంలో దేవయాన్ని అనే ఓ కన్నడ సినిమాకు స్వరాలు సమకూర్చే అవకాశం దక్కించుకున్నాడు ఈ యువసంగీత దర్శకుడు. అన్నింటికి బాపట్ల నుంచే పనిచేస్తున్నాడు. తమ ప్రాంతంలో పుట్టి పెరిగి సాంస్కృతిక, సినీ రంగాల్లో రాణించినవారు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతానని చెబుతున్న పవన్ ప్రతిభను స్థానికులు మెచ్చుకుంటున్నారు.
శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండటం... మంచి గాత్రం ఇవన్నీ పవన్‌కు మంచి సంగీత దర్శకునిగా ఎదిగేందుకు తోడ్పడ్డాయి. ఎక్కడెక్కడికో వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించకుండా ఉన్న ఊర్లోనే ఉంటూ అక్కడి అవకాశాలను ఒడిసిపట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తనతో పాటే మరికొందరు స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇవీ చదవండి...చిట్టి చేతులు చేశాయి అద్భుతం..