మితిమీరిన ఎరువుల వాడకంతో భూసారం సమతుల్యం కోల్పోవడం, ఆహార పంటలు స్వచ్ఛతకు దూరమవుతున్న వేళ.. సేంద్రీయసాగు కొత్త ఊపిరిలూదింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరు, నూతలపాటివారి పాలెం రైతులు ఈ ప్రకృతి సేద్యం విషయంలో అందరి కన్నా ఒక అడుగు ముందున్నారు. రెండేళ్ల క్రితమే 300 ఎకరాల్లో సేంద్రీయ సాగును ప్రారంభించారు. ఇప్పటికే రెండు పంటలు తీసిన రైతులు.... తాజాగా మూడో పంటతో లాభార్జన దశకు చేరుకున్నారు.
ప్రకృతి సేద్యంలో ఇప్పటికే ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న అత్తలూరు రైతులు. ఉన్న కమతంలోనే అంతర్ పంటలు వేస్తూ అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. అరటిలో క్యాప్సికం, బ్రకోలీ, క్యాబేజీ, క్యారెట్ వంటి అంతర్ పంటల్ని సాగు చేసి ఎఫ్‌పీవో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు. సేంద్రీయ సాగును ఇతర గ్రామాలకూ విస్తరించి రైతులు సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే లక్ష్యమని ఎఫ్‌పీవో నిర్వాహకులు చెబుతున్నారు.
సేంద్రీయ సాగుకు సాంకేతికత జోడించిన అత్తలూరు రైతులు.. డ్రిప్ విధానంలో పంటకు నీరందిస్తున్నారు. వేడిగాలులకు పంటల్లో తడి ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంటూరులోని కొన్ని కాలనీల ప్రజలతో ఎఫ్‌పీవో తరఫున ఒప్పందం చేసుకుని కూరగాయల్ని వారికి నేరుగా విక్రయిస్తున్నారు. బయటి మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రతి పంటకూ అయ్యే ఖర్చును అనుసరించి ముందుగా నిర్ణయించిన ధరలకే కూరగాయల్ని విక్రయిస్తారు.
దీని వల్ల నష్టాలకు తావులేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ప్రకృతి సేద్యం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేంద్రీయ సాగు విధానాన్ని ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించి ప్రకృతి సేద్యం సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకూ ఈ విధానాన్ని తీసుకెళ్తామని తెలిపారు.
ఇదీ చూడండి:
గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యం.. రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదు: అనగాని