గుంటూరు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో చిలకలూరిపేట సీఐ సుబ్బారావు, నాదెండ్ల ఎస్సై నారాయణరెడ్డిలకు నరసరావుపేట సహా ఉద్యోగులు పూలతో ఘన స్వాగతం పలికారు. ఇటీవల విధి నిర్వహణలో చిలకలూరిపేట సీఐ, నాదెండ్ల ఎస్సై, మరికొంత మంది సిబ్బంది కరోనా వైరస్ కు గురై సకాలంలో చికిత్స పొంది కరోనాను జయించారు.
కరోనాకు భయపడి ఎక్కువమంది చనిపోతున్నారని చిలకలూరిపేట సీఐ పేర్కొన్నారు. భయం వీడితే కరోనాను సులభంగా జయించవచ్చు అన్నారు. అందుకు ఉదాహరణ తన కుటుంబమని చెప్పారు. 4 సంవత్సరాల వయస్సు నుంచి 69 సంవత్సరాల వయసు వరకు పాజిటివ్ వచ్చినా ధైర్యంగా ఉండటం వల్లే ఈరోజు సంతోషంగా ఇంటికి చేరుకున్నామన్నారు. గ్రామీణ సీఐ సుబ్బారావు కరోనా నుంచి కోలుకుని విధులకు హాజరైయ్యారు. ఆయనకు ఎస్ఐలు, సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికారు.
కరోనాను జయించి ప్రజాక్షేమం కోసం వెనువెంటనే విధుల్లోకి హాజరవుతున్న పోలీసు అధికారులకు డీఎస్పీ వీరారెడ్డి అభినందనలు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా అధికారులు, ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ, పట్టణ ఒన్ టౌన్, టూ టౌన్, రూరల్ సీఐలు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.