Social Welfare Hostels Problems in Guntur: సభ ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా.. సంక్షేమమే మా లక్ష్యమంటూ పదే పదే ప్రచారం చేసుకునే వైసీపీ ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే సంక్షేమ వసతి గృహాల్ని మాత్రం సమస్యలకు నిలయాలుగా మార్చేసింది. పేద విద్యార్థులకు చదువు, వసతి అందించే.. వసతి గృహాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నాణ్యత లేని భోజనం, ఇరుకైన చీకటి గదులు, శుభ్రత లేని బాత్‌రూములు, సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం.. గుంటూరు జిల్లాలోని వసతి గృహాల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ వసతి గృహాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజన నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వారధిగా నిలవాల్సిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో దారుణంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుల కోసం పట్టణాలకు వచ్చే పిల్లలకు చక్కని వసతిని అందించాల్సిన సంక్షేమ వసతి గృహాలు సమస్యలతో సావాసం చేస్తున్నాయి.
విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం, విప్లవాత్మక మార్పులతో నాణ్యమైన విద్య అందిస్తామని హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో సంక్షేమ వసతి గృహాల్ని మరింత నిర్వీర్యం చేస్తోంది. వసతి గృహాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నాణ్యమైన భోజనం అందక, కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వరకు సంక్షేమ వసతి గృహాలుండగా.. వాటిలో ఎక్కువ శాతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
గుంటూరు కొత్తపేటలోని ప్రభుత్వ గిరిజన కళాశాల బాలురు వసతి గృహంలో అనేక సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులు ఇరుకుగా ఉండి, గాలి, వెలుతురు లేకపోవడం, అన్నంలో పురుగులు రావడం, మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఈ వసతి గృహంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నాణ్యతపై ఆరోపణలు రావడంతో ఇటీవలే అనిశా, విజులెన్స్ అధికారులు తనిఖీలు కూడా నిర్వహించారు. వార్డెన్ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా ఈ వసతి గృహ నిర్వహణలో ఎలాంటి మార్పు లేదు.
ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం కేవలం 45 రూపాయలు కేటాయించడం వల్లే నాణ్యతా ప్రమాణాలు లోపించాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నీళ్ల పప్పు, పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని, గడువు ముగిసిన సరుకులతో చేసిన ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకున్నాయని మండిపడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ నాలుగేళ్లలో వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. పిల్లలు మళ్లీ వసతి గృహాల్లో చేరాలంటే నిధులు కేటాయించి, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పక్కా భవనాలు నిర్మించి, శానిటరీ అధికారులు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
"సరైన వసతులు కల్పించడం లేదు. బాత్రూమ్లు సరిగ్గా లేవు. పెడుతున్న ఆహారం కూడా నాణ్యతగా ఉండటం లేదు. బిల్డింగ్స్ మంచిగా లేవు". - విద్యార్థి