Guntur Shilparam Inauguration: అందమైన శిల్పాలు.. ఆహ్లాదాన్ని పంచే పార్కులు.. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే నగర వాసులకు కాస్త సేదతీరేందుకు.. గుంటూరు ఇన్నర్ రింగురోడ్డులో శిల్పారామాన్ని నిర్మించారు. అయితే నిర్మాణాలు పూర్తయినప్పటికీ శిల్పాారామం మాత్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. నాలుగేళ్లుగా భవనాలు, నిర్మాణాలు నిరుపయోగంగా మారాయి. కాగా వాటిని పర్యాటక శాఖ అధికారులు ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు ఇన్నర్ రింగు రోడ్డులో గత ప్రభుత్వంలో కోట్ల నిధులు వెచ్చించి శిల్పారామంలో నిర్మాణాల పనులు చేపట్టారు. అయితే 2019లో ప్రభుత్వం మారడం వల్ల శిల్పారామం ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో నాలుగేళ్లుగా శిల్పారామం భవనాలు నిరుపయోగంగా మారాయి. గత ఏడాది శిల్పారామంలో అన్ని సదుపాయాలు కల్పించి దసరా పండుగ రోజున ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సంబంధిత అధికారులు చెప్పారు. దసరా పండగ గడిచి ఏడు నెలలు గడిచినా ఇంతవరకు ప్రారంభానికి ముహార్తం కుదరలేదు.
శిల్పారామం పూర్తయినప్పటికీ నేతలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనివ్వకుండా మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రాంగణంలోని స్టాల్స్ కొన్నింటిని తమ అనుచరులకు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు.. అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్టాండ్ తమకు అప్పగించాలని మరో డివిజన్ నాయకుడు పట్టుబడుతున్నారు. ఏమి చేయాలో తోచక సంబంధిత శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
శిల్పారామం ప్రహారీ గోడను ఆనుకుని ఉన్న చెరువును అభివృద్ధి చేసేందుకు ఐటీసీ సంస్థ ఏడాది కిందట ముందుకు వచ్చింది. దీంతో ఎట్టకేలకు ఇటీవల చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం కోటి రూపాయలుకు పైగా నిధులు ఇచ్చేందుకు ఐటీసీ అధికారులు అంగీకరించినట్లు కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. చెరువు కట్టలపై మొక్కలు నాటి నగర వాసులు వాకింగ్ చేసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించారు. అయితే శిల్పారామాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై మాత్రం ఎవరూ నోరు విప్పడం లేదు. దీంతో అందంగా నిర్మించిన భవనాలు, నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. కాగా.. నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ శిల్పారామంను అధికారులు వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: