Protest Of Sarpanches At Commissioner Office : గ్రామ సమస్యలు పరిష్కరించే సర్పంచులకే సమస్యలు వచ్చాయి. గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేసే సర్పంచులు ఊరి అభివృద్ధి కోసం అప్పులు చేస్తారు.. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న గ్రామ సర్పంచుల పరిస్థితి ఈ విధంగానే ఉంది. ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సర్పంచులు.. గుంటూరులోని కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
15వ ఆర్థిక సంఘంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం వల్ల పంచాయతీలకు రావలసిన రూ.2010 కోట్లు ఆగిపోయాయని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపారావు చెప్పారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడుని కలిసి 12 డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేశామన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మే నెలలో ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధమవుతామన్నారు. వేసవికాలంలో ప్రజలకు కనీసం తాగునీరు ఇచ్చేందుకు అయినా తమ వద్ద నిధులు లేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడుని కలిసిన అనంతరం రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావు మీడియా సమావేశం నిర్వహించారు. పాపారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీలకు రూ.2,010 కోట్ల నిధులు రావాల్సి ఉందని.. వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్పంచులకు రావలసిన నిధుల కోసం రెండుసార్లు దిల్లీ వెళ్లి నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను సర్పంచుల పరిధిలోకి తేవాలని.. దాంతో పాటు గ్రీన్ అంబాసిడర్ జీతాలను పూర్తిగా రాష్ట్రమే చెల్లించాలని అన్నారు. అలాగే మైనర్ పంచాయితీల కరెంటు బిల్లులను ప్రభుత్వమే కట్టాలని తెలిపారు. సమస్య పరిష్కారానికై ఈ నెల 29, 30న వైసీపీ నేతలకు వినతిపత్రాలు ఇస్తామని.. మే 1న స్పందనలో సర్పంచుల సమస్యలపై ఫిర్యాదు చేస్తామని పాపారావు చెప్పారు. అనంతరం మే 2 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని అన్నారు. మే 7లోగా ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని.. లేకపోతే మే 8న కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే అవకాశం ఇస్తే సీఎంను కలిసి మా సమస్యలు వివరిస్తామని పాపారావు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :