Sanitation Workers Facing Salary Problems: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు.. ఆ తీపి మాటలతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయని ఆశపడిన పారిశుద్ధ్య కార్మికులకు గత నాలుగేళ్లలో కష్టాలే మిగిలాయి. జీవితానికి భరోసా మాటెలా ఉన్నా.. నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వెతలు తీర్చండి మహాప్రభో అని కార్మికులు రోడ్లెక్కినా వైసీపీ సర్కార్ కనికరించడం లేదు. వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులతో కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తమ పట్ల సీఎం జగన్‌కు ఉన్న నిబద్ధత ఇదేనా అంటూ పారిశుద్ధ్య కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామాల్లో ఇళ్ల నుంచి చెత్తను సేకరించేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన గ్రీన్ అంబాసిడర్లకు 10 నెలలుగా వేతనాలు లేవు. నెలకు 6వేల రూపాయల చొప్పున వేతనం చెల్లించేలా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది కార్మికులను నియమించారు. వీరిలో 18 వేల మంది వరకు ప్రస్తుతం పని చేస్తున్నారు. వేతనాలు లేక వీరంతా ప్రస్తుతం రోడ్డున పడ్డారు. స్వచ్ఛాంధ్ర సంస్థ నుంచి నిధులు నిలిచి పోవడంతో కార్మికుల వేతనాలను పంచాయతీలే చెల్లించాలని జగన్ సర్కార్ చెబుతోంది.
work crisis: కూలీ పనులు లేక అల్లాడిపోతున్న కార్మికులు.. రోడ్ల మీదే పడిగాపులు
కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీలకు మినహాయించాక పంచాయతీలు నిధుల లేమితో అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వం, పంచాయతీలు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల జీవనం దయనీయంగా తయారైంది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట పంచాయతీలో ఆర్థిక ఇబ్బందులతో గౌరు అనే ఓ కార్మికుడు నెల కిందట ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పంచాయతీల్లో 1993లో నియమితులైన పారిశుద్ధ్య కార్మికులు, గుమస్తాలు, బిల్ కలెక్టర్లలో అత్యధికులు దాదాపు రెండేళ్లుగా జీతాలకు నోచుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 6వందల మందికి పైగా ఉన్న వీరిని మినిమం టైం స్కేల్ ఉద్యోగులుగా మొదట్లో గుర్తించి 010 పద్దు కింద ఖజానా శాఖ నుంచి జీతాలు చెల్లించేవారు. వీరందరికీ 020 హెడ్ కింద వేతనాలు చెల్లించేలా 2019లో జగన్ ప్రభుత్వం మార్పులు చేయడంతో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి.
ఈ మేరకు తగిన నిధులు కేటాయించక పోగా.. చివరకు గ్రామ పంచాయతీ సాధారణ నిధుల నుంచి జీతాలు చెల్లించాలని ఏడాది కిందట వైసీపీ సర్కార్ ఆదేశించింది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పంచాయతీలు వీరికి జీతాలు చెల్లించక పోవడంతో.. కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తుందని ఆశపడిన కార్మికులు చివరకు వేతనాలు కూడా సరిగా అందక అప్పులపాలవుతున్నారు.