Salary Delayed For Employees in Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు రావాల్సినవన్నీ సమయానికి వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నానని.. ఎన్నికల ముందు ప్రతి సభలోనూ సీఎం జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను మోసం చేశారు. జీతాలు ఎప్పుడు ఇస్తారా అని ఉద్యోగులు వేడుకునే దుస్థితి తీసుకొచ్చారు.
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే పక్కాగా 1వ తేదీన జీతం.. అవసరమైతే పీఎఫ్ నుంచి అడ్వాన్సులు.. రుణాల సదుపాయం.. ఆర్జిత సెలవుల డబ్బులు.. ఎప్పటికప్పుడు డీఏలు, పీఆర్సీలతో పెరిగే జీతం. వైసీపీ ప్రభుత్వంలో మాత్రం సమయానికి జీతం ఇస్తే చాలనే దుస్థితి ఏర్పడింది.
అప్పుడలా.. ఇప్పుడిలా: టీడీపీ హయాంలో 2017లో దసరా పండగ సెప్టెంబరు 30వ తేదీన రావడంతో ఆ నెల జీతాలను పండగకు ఇవ్వాలని ఉద్యోగులు కోరగా.. సెప్టెంబర్ 27నే ఇచ్చారు. అక్టోబరు 1న ఇవ్వాల్సిన సెప్టెంబరు జీతాన్ని ప్రభుత్వం ముందే ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో పండగకు ముందుగా జీతాలివ్వడం దేవుడెరుగు.. సమయానికి ఇస్తే చాలనే పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 23వ తేదీన దసరా ఉండగా.. సెప్టెంబరు నెల జీతాన్నే చాలామందికి 16వ తేదీ వరకూ ఇస్తూనే ఉన్నారు. ఇంకా కొందరు పింఛనుదారులకు, రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు పడలేదు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలందలేదు.. అడిగితే, నోటీసులు-కేసులు
ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదా..?: రాష్ట్రంలో సగానికి పైగా ఉద్యోగులకు ఏ నెలా 10వ తేదీలోపు జీతాలు అందడం లేదు. అందరికంటే చివరిగా జీతాలు పడేది ఉపాధ్యాయులకే. పింఛన్లూ సకాలంలో ఇవ్వడం లేదు. సెప్టెంబరు నెల పింఛన్లు ఈ నెల 16వ తేదీ వరకూ పడుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఆలస్యం చేస్తే వారు ఎలా బతుకుతారనే ఆలోచన సైతం ప్రభుత్వం చేయడం లేదు. గత సంవత్సరం నవంబరు జీతం డిసెంబరు 13వ తేదీ వరకూ పడకపోవడంతో ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు.
ఉద్యోగులపై బైండోవర్ కేసులు: గతంలో పీఆర్సీ, డీఏల కోసం ఆందోళన చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు జీతం కోసమే నిరసనలు చేసే దుస్థితి వచ్చింది.. గతేడాది నవంబరులో నిరసనలు తెలిపిన విజయనగరం జిల్లా జామి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు ఫోన్లు చేసి బెదిరించారు. ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెడుతున్నారు.
ఉద్యోగులు ఉసూరు!.. జీతం ఇస్తే చాలన్న పరిస్థితి
వాట్సప్‌లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు: జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి రావడంతో జీతం పడితే చాలు.. ఆ విషయం మిత్రులతో పంచుకుంటూ.. ఉద్యోగులు వాట్సప్‌లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రానివారు మాత్రం.. వచ్చిన వ్యక్తికి నువ్వు అదృష్టవంతుడి అంటూ వ్యాఖ్యానాలు పెట్టడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది.
No Salaries to Teachers: 'మొదటి తేదీన కాకుండా.. ఉన్నప్పుడు జీతం ఇస్తామనే ధోరణి సరికాదు'