Sajjala Ramakrishna Reddy about the three capitals: అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించే.. గతంలో 3 రాజధానుల బిల్లు పెట్టినట్లు పేర్కొన్నారు. రాజధానుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో నడుస్తోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు.
ఇదే క్రమంలో సజ్జల మాట్లాడుతూ... విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని వెల్లడించారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ అమరావతిలో ఉంటుంది.. అందుకే దానిని శాసన రాజధాని అంటున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు బెంచి కాదు మొత్తం హైకోర్టు కర్నూలుకే వస్తుందని సజ్జల వెల్లడించారు. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానం అన్నారు. తాము అసెంబ్లీలో, సుప్రీంకోర్టులో చెప్పే వాదనే ప్రధానమైందని సజ్జల తెలిపారు. వీటినే మేము మూడు కేపిటల్స్ అనే పిలుస్తామని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం కోర్టులో వినిపిస్తున్న విషయాన్నే బుగ్గన చెప్పారని సజ్జల వెల్లడించారు.
బుగ్గన వ్యాఖ్యలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణ అంశంపైనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయమా.. పూర్తిగానా అనేది సుప్రీం తీర్పును బట్టి ఉంటుందని సజ్జల వెల్లడించారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే అంశాన్ని మరోసారి వెల్లడించారు. రాజధానిపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనని కేంద్రం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ ద్వారా తెలిపిందనే విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులోనూ కేంద్రం అదే విధానాన్ని అవలంబిస్తుందని ఆశిస్తున్నట్లు సజ్జల వెల్లడించారు.
'నిన్న బుగ్గన ఒకసారి సమావేశాలే గుంటూరులో జరుగుతాయని అన్నారంటున్నారు. బుగ్గన ఏ సందర్భంలో అన్నారో తెలియదు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలతో వికేంద్రీకరణ అవసరాన్ని గుర్తించి గతంలో మూడు రాజధానుల బిల్లు పెట్టాం. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి తేడా లేదు. విశాఖను ఎగ్జిక్యూటివ్, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయి.'- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇవీ చదవండి: