మాతృభాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు అన్నారు. తెలుగు భాషకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని.. ఈ ఘనతను చూసి గర్వపడకుండా భాషా పరిరక్షణకు నడుంబిగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ సమాఖ్య రజతోత్సవాల్లో భాగంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ దుర్గాప్రసాదరావు, సీబీఐ పూర్వ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, సినీ రచయితలు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అనంత శ్రీరామ్, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ దుర్గాప్రసాదరావు.. భాషకు, జీవితానికి ఉండే బంధాన్ని విప్పిచెప్పారు. భాష ద్వారా సంస్కృతి.. సంస్కృతి ద్వారా మన జీవితాలు చక్కదిద్దుకోవచ్చన్నారు. మాతృభాషపై మమకారంతోపాటు పరభాషను గౌరవించాలన్నారు. తెలుగు భాష విశిష్ఠత, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. సాహితీ సమాఖ్య రజతోత్సవాల సందర్భంగా పలువురిని సన్మానించారు.
ఇదీ చదవండి: Cabinet Meeting: ఈ నెల 7న మంత్రివర్గం సమావేశం