RTC Buses Shortage Due to CM Meeting: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభ జరిగితే.. ప్రయాణికులు భయపడుతున్నారు. ఎక్కడ సభ జరిగినా ఆర్టీసీ బస్సులు తరలిస్తుండటంతో కొద్దిమంది ముందే వారి గమ్యస్థానాలకు చేరుకుంటుంటే.. మరికొంత మంది గంటల తరబడి వేచిచూడలేక ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా రాజధాని అమరావతిలో సీఎం జగన్ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను అధిక సంఖ్యలో తరలించటంతో విజయవాడలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో వేచి చూశారు. ఉదయం నుంచి కళాశాలల విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు, వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడ్డారు.
సాధారణ రోజుల్లో విజయవాడ సిటీ బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. కానీ సీఎం సభకు భారీగా సిటీ బస్సులను తరలించడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయలేదు. గంటకో , అరగంటకో ఒక బస్సు వస్తోంది. దీంతో బస్సులో సీటు దక్కించుకునేందుకు ప్రయాణికులు ఎగబడ్డారు. పలువురు బస్సులు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా ఆటోవాలాలు అడిగినంత దోచుకుంటూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు. దీంతో గత్యంతరం లేక చాలా మంది ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం బస్టాండ్‌లోనే వేచి చూశారు.
గంటల తరబడి ప్రయాణికుల అవస్థలు: పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి పలు జిల్లాల్లోని గ్రామాలు, దూర ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను సీఎం సభకు తరలించారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్సుల గురించి బస్టాండ్లలో అధికారులను అడిగినా, డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. సాధారణంగా ప్రయాణికుల అవసరాలకు మించి ఉన్న బస్సులనే ప్రభుత్వం వినియోగించుకోవాల్సి ఉండగా.. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను తరచూ సీఎం సభలకు పంపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ వెంకటపాలెంలో జరుగుతుండటంతో జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. చీరాల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు రద్దు కావటంతో కనీసం సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
నరసరావుపేట డిపో నుంచి 25 బస్సులు: పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ బస్సులు లేక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముఖ్యమంత్రి పర్యటనకు నరసరావుపేట డిపో నుంచి 25 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. దీంతో పిడుగురాళ్ల, చిలకలూరిపేట, చీరాల, ఒంగోలు రూట్లకు వెళ్లే బస్సులను కుదించి సీఎం సభకు పంపించారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులు ఉద్యోగులు, ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక ప్రయాణికులతో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ నిండిపోయింది. చేసేది లేక కొంతమంది ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లిపోగా.. మరికొంతమంది బస్సుల కోసం ఎదురుచూస్తూ గడిపారు.
సీఎం సభ నుంచి వెళ్లిపోయిన జనం: మరోవైపు వెంకటపాలెంలో జరుగుతున్న సీఎం సభ నుంచి జనం బయటికి వెళ్లిపోయారు. సీఎం జగన్ వచ్చిన వెంటనే ప్రజలు తిరుగుపయనమయ్యారు.