ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని నిర్ణయించిన సర్కారు... ఈ నెల నుంచే దీనిని వర్తింపజేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలో పదవీ విరమణ చేసే ఉద్యోగులను సర్వీసులో కొనసాగించేందుకు సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఆంజనేయరెడ్డి నేతృత్వంలోని ఆర్టీసీ విలీన, ఎలక్ట్రిక్ బస్సులపై అధ్యయన కమిటీ సభ్యులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి తమ నివేదికను సమర్పించారు. వయో పరిమితి పెంపు సిఫార్సును వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ బస్సులపై సూచనలు
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టేందుకు అనుసరించాల్సిన విధానాలపై ప్రభుత్వానికి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానం కింద టెండర్లు పిలిచి కొన్ని బస్సులు ప్రవేశపెట్టాలని సూచించింది. యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావచ్చని తెలిపింది. ఔత్సాహిక ప్రైవేటు సంస్థలకు... ఆర్టీసీలో విద్యుత్ బస్సులను పెట్టి నడుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. కమిటీ నివేదిక పరిశీలన అనంతరం సర్కారు ఈ అంశంపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
కమిటీ కీలక సిఫార్సులు
- ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం 'పర్యావరణ పరిరక్షణ నిధి' ఏర్పాటు
- ఈవీ బాండ్ల జారీ, జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సులభంగా తక్కువ వడ్డీకే రుణాలు పొందే సౌలభ్యం.
- విద్యుత్ వాహనాల ఛార్జింగ్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌కు బదులు సౌర విద్యుత్ వాడకం, వీలైన చోట్ల సంస్థ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు
- తిరుమలలో ఇంధన బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సుల వాడకం
- ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు సూచన... ప్రతి మూడు నెలలకోసారి కమిటీ భేటీ
- ఆర్టీసీలో ఈ బస్ బిజినెస్ డెవలప్మెంట్ డివిజన్ ఏర్పాటుకు సిఫార్సు
- కాంట్రాక్టు, స్థూల వ్యయ జీసీసీల సమీక్షకు యంత్రాంగం ఏర్పాటు
- సంస్థలో 350 ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలకు సూచన... ఇందులో రాయితీ పొందేందుకు ‘ఫేమ్–2’ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో వాటిని చేపట్టాలని తెలిపింది.
ఇదీ చూడండి :