రాజధాని అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని వివిధ రాజకీయపక్షాలు, రైతు, ప్రజాసంఘాలు తీర్మానించాయి. రాజధాని రైతుల ఉద్యమం జులై 4తో 200 రోజులకు చేరుతున్న సందర్భంగా గుంటూరు సీపీఐ కార్యాలయంలో రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, తెదేపా నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ రామకృష్ణతోపాటు అమరావతి ఐకాస, రాజధాని రైతుల ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా వచ్చినా రాజధాని ఉద్యమం ఆగలేదని.. వివిధ రూపాల్లో రైతులు, మహిళలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
రాజధాని రైతులకు మద్దతుగా జులై 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. జగన్ సహా అన్నిపార్టీల నేతలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయని.... ఇప్పుడు సీఎం కాగానే జగన్ మాట తప్పారని రామకృష్ణ విమర్శించారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి రాజధాని అంశంపై ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి కక్షతో వ్యవహరిస్తున్నారని.. అమరావతి నుంచి రాజధానిని తరలించే సామర్థ్యం సీఎంకు లేదని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు.
ఇవీ చదవండి... : 'ప్రజలకు కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటున్నారు'