గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు 60 సంవత్సరాల వృద్ధుడు, 10 ఏళ్ల బాలుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం- యడ్లపాడు మధ్య జాతీయ రహదారి పక్కన గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. వారిలో వృద్ధుడు కొన ఊపిరితో ఉండటంతో గుర్తించిన పోలీసులు హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. రహదారి పక్కన పడి ఉన్న మరో పది సంవత్సరాల బాలుడు అప్పటికే చనిపోవడంతో మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
వలస కూలీలు నడుచుకొని వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన వృద్ధుడి వద్ద లభించిన ఆధారాల ప్రకారం అతనిది హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్గా గుర్తించారు. మృతి చెందిన చిన్నారి బాలుడు వివరాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : జూన్ 30 వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లు రద్దు