నందికొట్కూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు 35 మంది ప్రయాణికులతో విజయవాడ బయలుదేరింది. నరసాపురం బైపాస్ సమీపానికి చేరుకునే సమయంలో అతివేగంతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో పక్కనే నిలిపివున్న మరో లారీని ఢీ కొట్టిందని ఆర్టీసీ డ్రైవర్ చెబుతున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు.
బస్సు బయలుదేరినప్పటి నుంచి డ్రైవర్ నిద్రమత్తుతోనే బస్సు నడిపారని ప్రయాణికులంటున్నారు. దారిలో రెండు ఘాట్ల ఉండటం వద్ద బస్సు అదుపుతప్పినట్లు ప్రయాణికులు చెప్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అరవడం వల్లే డ్రైవర్ అప్రమత్తమైనట్లు, అందువల్లే పెద్ద ప్రమాదం తప్పినట్లు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. లారీ క్లీనర్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాత్రులను నరసారావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.