REPUBLIC DAY 2023: రాష్ట్ర సచివాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి జెండా ఎగురవేశారు. జెండా వందనం అనంతరం పిల్లలకు స్వీట్లు పంచారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా కృషి జరుగుతోందని సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రిపబ్లిక్ డే రోజున 1950లో రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేశామన్నారు. రాజ్యాంగం ప్రకారం సార్వభౌమాధికారం ప్రజలదేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా.. ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ప్రజాహితం, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి సూచించారు.
సీఎం స్పెషల్ సీఎస్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. సీఎం స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి అధికారులు నివాళులు అర్పించారు. సీఎం సెక్రటరీ కె. ధనుంజయ రెడ్డి, సీఎం అడిషనల్ సెక్రటరీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇతర సీఎంవో అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
స్పీకర్ తమ్మినేని సీతారాం: సగర్వమైన పతాకాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నామని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అడ్డంకులు, అభివృద్ధి ఉంటాయని.. అడ్డంకులు తొలగిస్తూ అభివృద్ధి వైపు అడుగులేయాలన్నారు. రాష్ట్రం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకెళుతోందన్నారు. జాతి సమైక్యత కోసం అందరం కృషి చేయాలని కోరారు. పేదవాడు ఈరోజుకీ చేయి చాస్తూనే ఉన్నాడన్నారు. ఈ రాష్ట్రం, జెండా, దేశం నావే అనే నమ్మకాన్ని ప్రతీ ఒక్కరికి కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నం అయ్యిందన్నారు. స్వాతంత్య్ర ఫలాలను సామాన్యులకు పంచాలని స్పీకర్ తెలిపారు.
అర్హులైన వారందరికీ న్యాయం: బాపట్ల జిల్లా చీరాలలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం బలరాం జెండా ఎగురవేశారు. చుక్కల భూముల విషయంలో అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కరణం స్పష్టం చేశారు.
త్యాగాలు: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని జామియా మజీద్ మదర్సా ప్రాంగణం లో జాతీయ జెండా వందనం నిర్వహించారు. స్వతంత్ర సమరయోధులు త్యాగాలను స్మరించుకున్నారు. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రశంసా పత్రాలు: కర్నూలు జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని పోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు.
పురపాలక సంఘం కార్యాలయం: తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో జాతీయ జెండా ఎగుర వేశారు
గౌరవ వందనం: నెల్లూరు జిల్లాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఇవీ చదవండి