రాష్ట్ర మంత్రి బొత్స అమరావతిపై మాట మార్చడం ప్రజలను మోసం చేయడమేనని గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కొనసాగుతుందని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన బొత్స... 24 గంటలు గడవక ముందే మాట మార్చి ప్రజలను అవమానపర్చారని ధ్వజమెత్తారు. నిపుణుల కమిటీ నివేదిక తర్వాతే రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం సమంజసం కాదని అన్నారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలకు శాసనసభను వైకాపా వేదికగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు. 13 జిల్లాల అభివృద్ధికి, యువత ఉపాధికి దోహదపడే రాజధాని నిర్మాణానికి అడ్డుపడటం చారిత్రక తప్పిదమన్నారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతుందని విమర్శించారు. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగి పోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుందన్న విధంగా... ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంపై వైకాపా దృష్టి సారించిందన్నారు. హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వ భవనాలకు, ప్రజల ఆస్తులకు రంగులు వేయడం మానుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: