Rape Attempt: రాష్ట్రంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు... నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. మొన్న విజయవాడ, నిన్న గుంటూరు జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరగగా.. తాజాగా గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన వెలుగుచూసింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని మహిళా సంఘాల నేతలంటున్నారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ఘటన మరువక ముందే.. మరో మహిళపై అత్యాచారయత్నం వెలుగుచూసింది. శృంగారపురం గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసేందుకు పొలంలోకి తీసుకెళ్తుండగా.. భర్త కేకలు వేయడంతో దుండగుడు మహిళను వదిలేసి పరారయ్యాడు. గ్రామంలో మొక్కజొన్న కోసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది కూలీలు వచ్చారు. గ్రామానికి చెందిన యువకుడు పనికోసం వచ్చిన మహిళను అర్థరాత్రి దాటిన తర్వాత పొలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అది చూసిన భర్తతో పాటు తోటి కూలీలు కేకలు వేయడంతో యువకుడు మహిళను వదిలి పారిపోయాడు. అనంతరం ఘటనపై దుగ్గిరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలయ సమీపంలో ఓ ద్విచక్రవాహనం పోలీసులకు కనిపించింది. మహిళను లాక్కెళ్లేందుకు వచ్చిన యువకుడి వాహనంగా గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.