Ramya Case Judgement: గుంటూరుకు చెందిన రమ్య హత్య కేసులో ప్రత్యేక న్యాయస్థానం విచారణ పూర్తి చేసింది. పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యను.. కుంచాల శశికృష్ణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు. ప్రేమ కాదన్నదనే కోపంతో ఆగస్టు 15వ తేదీన.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తితో పొడిచి రమ్యను హత్య చేశాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన నరసరావుపేట పోలీసులు.. 15రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో విచారణ అధికారిగా నియమితులైన డీఎస్పీ రవికుమార్.. మొత్తం 36మంది సాక్షులను విచారించి ఛార్జ్‌షీట్ వేశారు. వారిలో 28 మందిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారించారు. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. డిసెంబర్ 7 నుంచి మార్చి 2వ తేదీ వరకూ ఈ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాల వాదనలు వినడం ప్రారంభించి.. మంగళవారంతో పూర్తి చేశారు. హత్య కేసులో కీలకమైన సీసీటీవీ దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ నెల 29వ తేదీన తీర్పు వెలువరిస్తానని ప్రకటించారు. నిందితుడు శశికృష్ణ ప్రస్తుతం గుంటూర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
రమ్య హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీలు రోడ్కెక్కి ఆందోళనలు నిర్వహించాయి. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇంతటి కీలక కేసు విచారణ పూర్తి కావడంతో.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సంబంధిత కథనాలు: