కృష్ణా నది వరద ఉద్ధృతితో పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరింది. 45 టీఎంసీల నీటితో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులో నీరు పెరిగే కొద్దీ ముంపు గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. బెల్లంకొండ మండలంలో ముంపు పరిధిలోని 11 గ్రామాల్లో 10 పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్లిపోయాయి. ఆ గ్రామాల్లో ఇళ్లు, పొలాలకు ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారమిచ్చింది. బోధనం, పులిచింతల, గోపాలపురం, కేతవరం, చిట్యాల, కోళ్లూరు గ్రామాలు నీటమునిగి.. బయటి ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ముందుగానే అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. ఎమ్మాజీగూడెం కూడా ముంపు పరిధిలోనే ఉన్నా 90 ఇళ్లకు మాత్రమే పరిహారం దక్కింది. మరో 125 ఇళ్లనూ ముంపు పరిధిలో గుర్తించి గెజిట్ జారీ చేసినా పునరావాస ప్యాకేజి ఇవ్వలేదు. ఫలితంగా ఆ గ్రామంలో ప్రజలు అలాగే ఉండిపోయారు. కొన్ని పొలాలనే ముంపు పరిధిలో చేర్చిన అధికారులు వాటికి పరిహారమిచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ అధికారిక లెక్కల్లో లేని పొలాలు సైతం ప్రస్తుతం ముంపులోకి వెళ్లిపోయాయి. గతేడాది కూడా ఇలాగే జరిగిందని... పంట నీట మునిగి తాము పెట్టిన పెట్టుబడులు కృష్ణార్పణమయ్యాయని రైతులు వాపోతున్నారు.
పరిహారం అందక...పరాయి ఇళ్లలో
పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్ధ్యం 45.77 టీఎంసీలు. జలాశయంలో 35 టీఎంసీలు దాటినప్పటి నుంచి ముంపు ముప్పు మొదలవుతుంది. 42కు చేరుకోగానే 90శాతం గ్రామాలు, అక్కడి పొలాలు నీట మునిగిపోతాయి. 45 టీఎంసీలకు చేరుకున్నప్పటి నుంచి మిగతా పొలాలు, గ్రామాల్లోకి నీరు వచ్చిచేరుతుంది. ఇలా ప్రస్తుతం ఎమ్మాజీగూడెంతో పాటు మాచరవరం మండలంలోని వెల్లంపల్లి, రేగులగడ్డ గ్రామాలు కూడా ముంపులో చిక్కుకున్నాయి. వెల్లంపల్లిలోనూ మరో 90 కుటుంబాలకు పరిహారం అందలేదు. రేగులగడ్డ గ్రామానికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించినా పూర్తిగా అమలు చేయని పరిస్థితి. ఓవైపు పొలాలు మునిగి... మరోవైపు ఇళ్లలోకి నీరు చేరి... పరిహారం అందక... పరాయి ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఎమ్మాజీగాడెం వాసులు వాపోతున్నారు.
ఇదీ చదవండి : సంయుక్త కమిటీ పర్యవేక్షణలోనే కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు