రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి అవసరమైన పీపీఈ కిట్లు సమకూర్చాలని నిబంధనలు చెబుతున్నా.. కనీసం గ్లౌజులు కూడా సమకూర్చలేని స్థితిలో వైద్య ఆరోగ్య శాఖ ఉందని మండిపడ్డారు. తెనాలి కొవిడ్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వకపోవటంతో రెయిన్ కోట్లు వేసుకొని పని చేసిన ఘటన కలిచి వేస్తోందన్నారు.
కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి వైద్యులు రక్షణ కిట్లు సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిన మాట వాస్తవమా? కాదా? రాజమండ్రి ఆసుపత్రిలో ఓ పాత్రికేయుడు ఆక్సిజన్ లేకపోవడం వల్లే చనిపోయారు. తిరుపతిలో ఓ తితిదే ఉద్యోగి కూడా ఇదే విధంగా ప్రాణాలు విడిచారు. కొవిడ్ విధుల్లో ఉన్న హౌస్ సర్జన్లు, రెసిడెంట్ డాక్టర్లకు నాలుగు నెలలుగా ఉపకారవేతనం కూడా ఇవ్వడం లేదు. తక్షణమే వారికి రావాల్సిన మొత్తాన్ని విడుదల చేయాలి- నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్
ఇదీ చదవండి