Protests Against Chandrababu Arrest: అవినీతి కేసుల్లో జైలు జీవితాన్ని గడిపిన సీఎం జగన్ తనకు అంటిన అవినీతి మరకను చంద్రబాబుకు కూడా పూసేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తే.. అందులో అవినీతి ముద్ర వేసి అన్యాయంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి వద్ద వేదవతి నదిలో నడుము లోతు ఇసుకలో ఉంటూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
మోత మోగిన ఆంధ్రప్రదేశ్... రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన చంద్రబాబు అభిమానులు
స్కిల్ కేసులో చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారంటూ ప్రకాశం జిల్లా దోర్నాలలో షేక్ మౌలాలి అనే వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దర్శిలో దీక్షల్లో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పాల్గొన్నారు. సంతనూతలపాడు మండలం చదలవాడలో మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఒంగోలులో మహిళా కార్యకర్తలు దీక్షలను కొనసాగించారు. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ పల్నాడు జిల్లా వినుకొండలో కళ్లకు గంతలు కట్టుకుని దీక్షలు కొనసాగించారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు దర్షిత్, రేపాకుల శ్రీనివాస్‌ల ఆరోగ్యం విషమించడంతో వైద్యులు పరీక్షలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం విజయవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలు విష్ణు సహస్ర నామం, లలితా సహస్రనాం, హనుమాన్ చాలీసా పఠించారు. జగ్గయ్యపేటలో దీక్షాపరులకు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ నిమ్మరసం అందచేసి దీక్షలను విరమింపజేశారు.
తూర్పుగోదావరి బిక్కవోలు మండలం ఆర్.ఎస్.పేటలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి చంద్రబాబును ప్రభుత్వం అరెస్టు చేయించిన విధానాన్ని వివరించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురత్రయంలో టీడీపీ శ్రేణులు కాగడాలతో ప్రదర్శన నిర్వహించాయి. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దీక్షా శిబిరంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.