ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి ఏడాది చదువుతున్న ఓ విద్యార్థినితో అదే విభాగానికి చెందిన అతిథి అధ్యాపకుడు సోమవారం అసభ్యంగా ప్రవర్తించారు. ఆయన నుంచి తప్పించుకున్న విద్యార్థిని.. మంగళవారం తన తల్లిదండ్రులను తీసుకొని వర్సిటీకి వచ్చి, విభాగాధిపతికి ఫిర్యాదు చేశారు. ‘అతిథి అధ్యాపకుడు కొంతకాలంగా నన్ను గమనిస్తున్నారు. ఎప్పుడూ తరగతిలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు? మాస్కు తీయవా? అని మాట్లాడేందుకు యత్నించేవారు. సోమవారం నేను మెట్లు దిగే సమయంలో ఒంటరిగా ఉండడాన్ని చూసి అసభ్యంగా ప్రవర్తించారు. నా చేయి పట్టుకొని మాస్కును తొలగించేందుకు యత్నించారు’ అని ఫిర్యాదులో వివరించారు.
తేలిగ్గా తీసుకున్నాయ?
అతిథి అధ్యాపకుడు విశ్వవిద్యాలయంలో ఓ ఉన్నతాధికారికి నమ్మిన బంటు కావడంతో ఫిర్యాదును వర్సిటీ వర్గాలు తేలికగా తీసుకున్నాయని, గతంలోనూ ఆయన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయని కొందరు తెలిపారు. ఇదే విషయమై వర్సిటీలో ఆంగ్ల విభాగాధిపతి సురేష్‌బాబును వివరణ కోరగా.. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు మంగళవారం తనకు ఫిర్యాదు చేశారని, విషయాన్ని తాను ‘యాంటీ ర్యాగింగ్ సెల్’ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సంబంధిత అతిథి అధ్యాపకుడి వివరణ కోరామని వెల్లడించారు.
ఇదీ చదవండి: అకస్మాత్తుగా పారిశుద్ధ్య కార్మికుడు మృతి