AP Crime News : గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో యువతులతో నగ్నపూజలు చేయించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పూజారి నాగేశ్వరరావుతోపాటు అతనికి సహకరించిన మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నగ్నపూజలు చేస్తే గుప్తనిధులు సమకూరుతాయని, ఒక్కో మహిళకు 50వేల రూపాయలు చొప్పున ఇస్తామని ముఠా నమ్మించి, ఈ దారుణానికి ఒడిగట్టింది. మోసానికి గురయ్యామని బాధిత మహిళలు గ్రహించారు. గోరింట్ల వద్ద దిశా ఫోన్ నంబరు 112కు ఫోన్ చేయగా, నల్లపాడు పోలీసులు వచ్చి వారిని రక్షించారు. నిందితుల అరెస్టు వివరాలను గుంటూరు సౌత్ డీఎస్పీ మహబూబ్ బాషా మీడియా సమావేశంలో వివరించారు. ఇలాంటి మూఢ నమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆపదలో ఉన్న మహిళలు దిశా యాప్‌ను ఉపయోగించుకోవాలని డీఎస్పీ మహబూబ్ బాషా చెప్పారు.
ఆన్లైన్ బెట్టింగ్.. దొంగగా మారిన బ్యాంక్ ఉద్యోగి.. : బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగం, మంచి జీతం పొందుతూ ఆన్లైన్ బెట్టింగ్‌లతో అక్రమార్జనకు అలవాటు పడ్డాడు. చివరకు దొంగతనాలకు అలవాటు పడిన నిందితుడిని కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసిన నర్సీపట్నం జిల్లా పీనారిపాలెంకు చెందిన చిటికెల నాగేశ్వరరావు అన్నవరంలో ఓ ఇంట్లో సుమారు 22 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశాడు. పోలీసులు 48 గంటల్లో నిందితుడిని అరెస్టు చేసి చోరీ చేసిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో తాను పని చేసిన బ్యాంకు లాకర్లో బంగారం చోరీ చేసి అమ్ముకున్న కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఏటీఎంలో నగదు చోరీ చేసి అరెస్టయ్యాడు. బెయిల్‌పై వచ్చిన నిందితుడు అన్నవరంలో ఇంట్లో చోరీ చేసి మరో సారి జైలు పాలయ్యాడు.
తిరుమలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి : తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదం ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన భక్తులు శ్రీవారి దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే రోడ్డు మార్గంలో 24వ మలుపు వద్ద సుమో వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. వాహానానికి బ్రేకులు వైఫల్యం చెందటంతో రేణుకమ్మను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాయదుర్గానికి చెందిన రేణుకమ్మ అక్కడక్కడే మృతి చెందగా, వాహనంలోని మెదక్‌కు చెందిన పార్వతమ్మ కూడా మృతి చెందింది. ఈ ప్రమాదంలో వాహనంలో పలువురికి గాయాలు కావడంతో టీటీడీ ఘాట్ రోడ్డు సిబ్బంది అంబులెన్స్ ద్వారా తిరుపతికి రుయా ఆస్పత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి : అనకాపల్లి జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు జరిగింది. ఈ ప్రమాదంలో ఏలూరు జిల్లా గణపవరం మండలం అప్పన్నపేటకు చెందిన ఎల్లా బాలకృష్ణ మోహన్ (27) మృతి చెందాడు. ఐదుగురికి గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారికి పక్కగా ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఇవీ చదవండి