గుంటూరు జిల్లా దుర్గిలో పోలీసుల అత్యుత్సాహానికి మండల స్థాయి రెవెన్యూ అధికారి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రేషన్ బియ్యన్ని తరలిస్తున్న ఓ ఆటోను అడ్డుకొని ప్రశ్నించినందుకు.. దుర్గి ఎస్సై, సిబ్బంది రెవెన్యూ అధికారిపై విరుచుకుపడ్డారు. ఆటోను అడ్డుకోవటానికి నీకేం అధికారముందంటూ సదరు అధికారిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. మండల పరిధిలో పౌరసరఫరాల పర్యవేక్షణ బాధ్యతలు చూసే డిప్యూటీ తహసీల్దార్ మురళీధరరావుకు ఎదురైన చేదు అనుభవం ఇది.
సదరు అధికారి సీఎస్డీటీ గుర్తింపు కార్డు చూపించినా.. పోలీసులు అధికారి మాట వినలేదు. ఈ విషయం స్థానిక వీఆర్వో ద్వారా ఇతర అధికారులకు తెలియటంతో మురళీధరరావును విడిచిపెట్టారు. ఘటనపై మాట్లాడేందుకు మురళీధరరావు ఇష్టపడ లేదు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధ్రువీకరించడం లేదు. దీనిపై రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి: అపహరణకు గురైన చిన్నారి గుర్తింపు.. పరారీలో నిందితుడు