ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. మరోవైపు భూగర్భ డ్రైనేజీ పనుల ఇబ్బందులు తొలిగిపోయాయి. దీంతో రహదారుల వెంబడి మొక్కలు నాటి వాటిని విరివిగా పెంచాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ చల్లా అనురాధ ఇటీవల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇటీవలే కార్పొరేషన్‌కు కొత్తగా ఉద్యాన పోస్టు ఒకటి మంజూరైంది. అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్‌లో ఓ అధికారిని నియమించారు. పచ్చదనం-పెంపుదల చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఈ సీజన్‌లో 50 వేల మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందింది. అర్బన్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీన్‌హౌస్ కార్పొరేషన్ నుంచి ఇప్పటికే 8 వేల మొక్కలను సమకూర్చుకున్నారు. మరో 10 వేల మొక్కలను సేకరించుకోవాలని ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. ఇంకో 20 వేల మొక్కలకు త్వరలోనే టెండర్లు పిలవాలని యంత్రాంగం భావిస్తోంది. నగరంలో 1.75 లక్షల నివాసాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో 32 వేల మొక్కలు నాటాలని అర్బన్ గ్రీన్‌హౌస్ కార్పొరేషన్ లక్ష్యాన్ని నిర్దేశించింది.
వాలంటీరుదే బాధ్యత..
నగర కమిషనర్ ఇటీవల సచివాలయాల కార్యదర్శులు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీలతో సమావేశమయ్యారు. నగరంలో ప్రతి సచివాలయం పరిధిలో మొక్కలు ఎన్ని అవసరమో గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈమేరకు ప్రతిపాదనలు చేరాయి. ప్రతి వార్డు వాలంటీర్ తన పరిధిలో ఉన్న 50 నుంచి 75 ఇళ్లల్లో ఏ ఇంటి ముందు అయితే మొక్కలు లేవో గుర్తించి అక్కడ ఆ ఇంటి యజమాని సహకారంతో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నగరంలో మొక్కలు నాటడమే తప్ప తిరిగి వాటి బాగోగులు అంతగా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.
దానికి తావు లేకుండా ఈ ఏడాది మొక్కలు నాటే నుంచి పెంపకం దాకా వార్డు వాలంటీర్లు, ఎమినిటీస్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించటంతో క్షేత్రస్థాయిలో వార్డు వాలంటీర్లు తమ పరిధిలో ఇళ్ల వద్ద ఎక్కడైతే మొక్కలు లేవో గుర్తించి వాటిని వారి పరిదిలోని సచివాలయాల దృష్టికి తీసికెళ్లారు. ఇళ్ల ముంగిట రహదారుల వెంబడి నాటడమే కాదు.. ప్రజలు ఎవరైనా మొక్కలు పెంచుకుంటామని ఆసక్తి కనబరిస్తే వారికి మొక్కలు ఉచితంగా అందజేస్తామని నగర కమిషనర్ అనురాధ తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేస్తామని, సుమారు లక్ష ఇళ్లకు ఇంటికో మొక్క చొప్పున పంపిణీ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె వివరించారు.
గుంటూరు ఒకప్పుడు పచ్చని చెట్లతో ఉండేది. నగరంలో ప్రధాన రహదారులు మొదలుకుని అంతర్గత రోడ్ల వెంబడి ఎటు చూసినా పచ్చదనమే కనువిందుచేసేది. అలాంటి నగరంలో ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగైంది. లక్ష్మీపురం, కొరిటిపాడు రహదారుల్లో రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్దచెట్లు ఉండేవి. అవన్నీ కాలక్రమేణా కనుమరుగయ్యాయి. అభివృద్ధి పేరుతో వాటిని కూకటి వేళ్లతో పెకిలించేశారు. దీంతో నగరంలో ఏటేటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీన్ని నివారించటానికి.. నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దటానికి ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు పెంపకం చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ నిర్ణయించింది.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో విస్తరిస్తున్న కరోనా...68 కొత్త కేసులు నమోదు