గుంటూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోవడంతో.. ఆశావహులు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు సంతానం ఉంటేనే అర్హులు. 1995, మే 29 తర్వాత ముగ్గురు సంతానం కలిగి ఉన్న వారు పోటీకి అనర్హులని ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994లో నిబంధన ఉంది. దీంతో ముగ్గురు పిల్లలు ఉన్న వారు ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే.. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటరుకు.. రోజూ కొందరు ఫోన్ చేసి తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అధికారులను కలిసి నామినేషన్ పత్రాలు ఇవ్వమని కోరితే మీకు అవకాశం లేదని చెప్పి తిప్పి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులమా? ఇదెక్కడి నిబంధన అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చట్టంలో నిబంధన ఉన్నందున ఎవరూ ఏమీ చేయలేరని ఉద్యోగులు వారికి చెబుతున్నారు. మరికొందరు ఓటు కోసం రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసినా ఓటరు జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేశారు. సంబంధిత మండలాల తహసీల్దార్లను కలిసి వివరాలు పొందాలని సూచించారు.
ఇదీ చదవండి: