జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లక్ష్యాలను సాధించాలని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది కంటే 20 శాతం అధికంగా ఉపాధి హామీ లక్ష్యాలను చేరుకోవాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించారు. తాడేపల్లిలోని పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డ్వామా పీడీల సదస్సుకు హాజరైన మంత్రి ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు నరేగా పనులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో గ్రామస్థాయిలో ప్రతిపాదిత పనులు చేపట్టాలని అన్నారు. 40 వేలకుపైగా ఉన్న పాఠశాలల్లో ప్రహరీగోడలు, మరుగుదోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అంతర్గత రహదారులు, ఉద్యాన పంటలు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. 11 వేలకుపైగా ఉన్న గ్రామ సచివాలయాలకు ఉపాధి హామీని వర్తింపచేయాలని స్పష్టం చేశారు. చిత్తూరు, అనంతపురం వంటి జిల్లాల నుంచి వలసలు తగ్గించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిసేవ పథకం కింద గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాలని మంత్రి డ్వామా పీడీలకు సూచించారు.
ఇదీ చూడండి: 'ఉపాధి హామీ'ని కొనసాగించాలని ధర్నా