గుంటూరు జిల్లా పిన్నెల్లిలో భూ తగాదాలు, వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులమడం సాధారణంగా మారింది. ఏ చిన్న సంఘటన జరిగినా స్థానిక నాయకులు చొరపడి వివాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అధికార పక్షంలో ఉన్నవారు తమదే పైచేయి కావాలనే ఉద్దేశంతో దాడులను ప్రోత్సహిస్తున్నారు. అయితే కొంతమంది స్వార్థం వల్ల తామంతా భయంతో గడపాల్సి వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని మౌనంగా భరిస్తున్నామని అంటున్నారు. గత ఏడాది ప్రత్యర్థుల దాడులు తట్టుకోలేక కొంతమంది ఊరొదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసి బాధితులను ఆదుకుంటామని ముందుకొచ్చింది.
పిన్నెల్లిలో వివాదాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తరువాత పెద్దఎత్తున విమర్శలు రావడంతో పోలీస్ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఊరొదిలి వెళ్లిన వారందరినీ స్వగ్రామాలకు తీసుకొచ్చి, ఇరు వర్గాలతో శాంతియుత సమావేశాలు నిర్వహించింది. గొడవలకు వెళ్లితే కలిగే అనర్థాలను వివరించింది. ఆ తరువాత కొంతకాలం బాగానే ఉన్నా, మరలా వర్గపోరు మొదలైంది. దాడుల పరంపర కొనసాగడంతో, కొన్ని కుటుంబాలు మరోమారు గ్రామం వదిలి పెట్టి వెళ్లిపోయాయి. పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఎవరైనా వారి పొలాలను కౌలుకు తీసుకున్నా, బెదిరింపులతో దరిచేరనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నేపథ్యంలో గొడవలు తీవ్రస్థాయికి చేరాయి. అప్పటి నుంచి అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి.
పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా వారం రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులపై దాడులు జరిగాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామస్థులు భయపడుతున్నారు. కొంతమంది స్వార్థం వల్ల గ్రామానికి చెడ్డపేరు వస్తుందని, ఇకనైనా పోలీసులు రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టి గ్రామంలో శాంతిని నెలకొల్పాలని కోరుతున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి
పిన్నెల్లిలో గొడవలు జరగకుండా పికెట్ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటున్నాం. తాత్కాలిక ఆవేశాలకులోనై ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారే తప్పితే, ప్రణాళిక ప్రకారం జరుగుతున్నవి కావు. ఏ చిన్న విషయం జరిగినా, వెంటనే స్పందిస్తున్నాం. అనుక్షణం నిఘా ఉంచుతున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సై, మాచవరం
ఇదీ చదవండి: ప్రజాస్వామ్యానికి సంకెళ్లు! అత్యయిక స్థితికి 45 ఏళ్లు