Oxygen Plant Machine: జగనన్న ప్రాణవాయువు, పీఎమ కేర్ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్లకు ఇప్పుడు తాళాలు వేలాడుతున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం కరోనా సమయంలో 10 K.L., 20 K.L. సామర్థ్యంతో రెండు ప్లాంట్లు నిర్మించారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోదన్న ఉద్దేశంతో కొంతకాలంగా ఒకదానిని పక్కన పెట్టారు. విశాఖ నుంచి వచ్చే లిక్విడ్ గ్యాస్‌ను వాయువుగా మార్చేందుకు మరో దానిని అడపాదడపా వాడుతున్నారు.
కోట్ల రూపాయలు విలువ చేసే ఆక్సీజన్ ప్లాంట్లు ఆస్పత్రి ఆవరణంలో ఉన్నా.. రోగుల అవసరాలకు మాత్రం అవి ఉపయోగపడట్లేదు. దీంతో ప్రజలు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీల ఒత్తిడితోనే జీజీహెచ్ సిబ్బంది ప్లాంటు వినియోగాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లలోకి సులువుగా ఆక్సీజన్ సరఫరా చేసేందుకు.. ప్రాణవాయువు కేంద్రాల నుంచి అంతర్గత పైవులైన్లను ఏర్పాటు చేశారు.
గాలి ద్వారా ఆక్సీజన్‌ను ఒడిసిపట్టే యంత్రాలను అమర్చారు. ఇప్పుడు అవేమీ వినియోగంలో లేవు. దీంతో రెండు మూడు రోజులకోసారి లిక్విడ్ గ్యాస్‌ను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయువు స్వచ్ఛత 93 శాతం మాత్రమే ఉందని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు.
విశాఖ నుంచి వచ్చే లిక్విడ్ ఆక్సిజన్ స్వచ్ఛత 99 శాతం ఉందని.. వైద్యుల సిఫార్సుల మేరకు దానిని వినియోగించుకుంటున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. అయితే ఇప్పటికైన ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ స్పదించి ప్రాణవాయువు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు వేడుకుంటున్నారు.
"జగన్న ప్రాణవాయువు, పీఎం కేర్ ద్వారా రెండు ప్లాంట్లు మా ఆస్పత్రిలో ఉన్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఉండేది. ఆ సమయంలో ప్రాణవాయువు ట్యాంక్ రాకపోవటం వంటి సమస్యలు తలెత్తటం వల్ల పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాము. అలాంటి సమయంలో పేషెంట్స్ ఏమైపోతారో అనే ఆలోచనతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆక్సీజన్ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయ్యే ప్రాణవాయువు స్వచ్ఛత 93 శాతం మాత్రమే ఉంది. విశాఖ నుంచి వచ్చే లిక్విడ్ ఆక్సిజన్ స్వచ్ఛత 99 శాతం ఉంది. అందువల్ల వైద్యుల సిఫార్సుల మేరకు దానిని వినియోగించుకుంటున్నాము. ఈ 93 శాతం స్వచ్ఛత ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగించటం వల్ల పేషెంట్స్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు అనే సందర్భంలో.. తప్పకుండా అవసరమైన ప్రతి రోగికి వీటిని వినియోగిస్తాము." - డాక్టర్ ప్రభావతి, జీజీహెచ్ సూపరింటెండెంట్
ఇవీ చదవండి: