No Power Restrictions for Industries: రాష్ట్రంలో మారిన వాతావరణం, ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులతో విద్యుత్తు వినియోగం తగ్గినందున.. పరిశ్రమలకు విధించాలని నిర్ణయించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గిందని.. గత రెండు రోజులుగా ఎలాంటి విద్యుత్ కొరత లేదని అన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో , ఏపీపీసీసీ అధికారులతో విజయవాడలోని విద్యుత్ సౌధలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిమేర తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడినందున.. పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
No Power Holiday for Industries: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎటువంటి పరిమితులు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు ఆదివారం ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆదివారం మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయని.. ఎక్కడా సరఫరాలో అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్ లేదన్నారు.
Industrial Electricity Restrictions Lifted: సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్ – సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్ది మేర విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయన్నారు. వ్యవసాయ, గృహ వినియోగ రంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలు భావించాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్తు నియంత్రణ మండలికి అభ్యర్ధన పంపించామన్నారు.
విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్ధన మేరకు ఈనెల రెండో తేదీన ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ వాడకంలో పరిమితులు విధించవచ్చని అనుమతించిందన్నారు. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల విద్యుత్ వాడకంలో పరిమితి – నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదన్నారు. ఈనెల 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు.. ప్రతి యూనిట్‌కు రూ 9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.