No Irrigation Water To Chilli Crop : వర్షాభావ పరిస్థితులు, సాగర్ కాలువల్లో పారని నీరు.. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన పంట కళ్లముందే ఎండిపోతుంటే.. చూస్తుండలేక తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండుతున్న మిర్చి పంటను కాపాడేందుకు రైతులు ట్యాంకర్లతో రక్షక తడులు అందిస్తున్నారు. అదనంగా ఖర్చవుతున్నా అన్నదాతలు పట్టువీడకుండా శ్రమిస్తున్నారు.
Chilli Farmers Problems in Guntur District : గుంటూరు జిల్లాలో 2.5 లక్షల ఎకరాల మేర మిరప పంట సాగవుతోంది. పెట్టుబడుల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉన్నా మిర్చికి మంచి ధర ఉందనే ఉద్దేశంతో రైతులు ఎక్కువ మంది పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ సారి జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల లేకపోవటం.. మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కాలువలకు నీరు రాకపోవటంతో రైతులు బోర్లపై ఆధారపడ్డారు. అవిలేని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నీరు లేక మొక్కలు వడలిపోతున్నాయి. ఎలాగోలా పంటని కాపాడాలనే ప్రయత్నాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటకు అందిస్తున్నారు. రక్షక తడుల ద్వారా పంటను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Chilli Farmers Problems: అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు
Farmers Worried about Crop Loss in Guntur District : భవిష్యత్తులో వర్షాలు కురిసినా, కాలువలకు నీరు వచ్చే వరకు పంటను కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. మొదట్లో సమీపంలోని డ్రెయిన్ల నుంచి నీరు తెచ్చిపోశారు. ఇప్పుడు డ్రెయిన్లలోనూ నీరు లేకపోవడంతో ఇతర రైతుల బోర్ల వద్ద నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నారు. ఆ నీటిని ట్యూబుల ద్వారా పంటకు అందిస్తున్నారు.
Farmers Supplying Water to Chilli Crop with Tankers : మిర్చి పంటకు పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతాయి. విత్తనాలు, పురుగు మందులతో పాటు కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది. ఇప్పటికే రైతులు ఎకరాకు 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు సాగు నీటి వ్యయం అందుకు తోడవటంతో మిర్చి రైతులకు పెట్టుబడులు అమాంతం పెరిగాయి. లారీ ట్యాంకర్ 3 వేల రూపాయలు, ట్రాక్టర్ ట్యాంకర్ అయితే వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నారు. ఎకరా పంటకు నీరు అందించాలంటే దాదాపు 10 ట్యాంకర్లు అవసరం అవుతాయి. లారీ ట్యాంకర్ అయితే 3 లేదా 4 పడతాయి. ఇలా రక్షక తడుల కోసమే రైతు ఎకరాకు 10 వేల రూపాయలు వరకు ఖర్చు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపుతో పాటు వాటిని మొక్కలకు అందించటం రైతులకు భారంగా మారుతోంది.
Vegetable Crops Drying up Due to Lack of Water: నీటి కరవు.. వేల ఎకరాల్లో ఎండుతున్న కూరగాయల పంటలు
Huge Demand For Water Tankers : మిర్చి పండించే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నీటి ట్యాంకర్ల రాకపోకలు కనిపిస్తున్నాయి. తాగునీరు అందించే ట్యాంకర్లు ఇప్పుడు పంట పొలాల వెంట పరుగులు తీస్తున్నాయి. రైతుల నుంచి నీటి కోసం ఆర్డర్లు వస్తుండటంతో ట్యాంకర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.