Wild Animals in Telangana forests : తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు అటవీశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వరంగల్‌లోని కాకతీయ జూ పార్క్ నుంచి ఇటీవల 20 చుక్కల దుప్పులు, 13 సాంబార్ జింకలు(ఖనుజు), 6 నెమళ్లను ఏటూరు నాగారం అభయారణ్యానికి, అదే విధంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు 19 చుక్కల దుప్పులను తరలించినట్లు తెలిపింది.
రానున్న రోజుల్లో దాదాపు 400 జింక(చుక్కల దుప్పి, కృష్ణ జింక, మనబోతు, ఖనుజు)లను జూపార్క్, మహావీర్ హరిణ వనస్థలి నుంచి రాష్ట్రంలో ఉన్న పులుల ఆవాసాలకు తరలించనున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ హెచ్‌ఓఎఫ్‌ఎప్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్.ఎం.డోబ్రియాల్ తెలిపారు.
కవ్వాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు కిన్నెరసాని, ఏటూరునాగారం, పాకాల అభయారణ్యాలలో జంతు సమతుల్యత పెంచేలా ఈ తరలింపు దోహదపడుతుందన్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఈ తరలింపు ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ అడవుల్లో వన్యప్రాణి సంపదను మరింత పెంచేందుకు జూ పార్కుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న శాకాహార జంతువులను పులుల అభయారణ్యాలకు, రక్షిత అటవీ ప్రాంతాలకు తరలించేందుకు నిర్ణయించినట్లు అటవీశాఖ పేర్కొంది.
నల్లమలలో పెద్దపులి సంచారం : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అటవీశాఖ రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మండలం పెద్దూటిపెంట సమీపంలోని శూలాలకుంట, జాలుపెంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు పులి చిత్రాలను బంధించినట్లు అటవీశాఖ అధికారవర్గాల ద్వారా మంగళవారం తెలిసింది. ఇప్పటికే అమరగిరి, సోమశిల అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న మహాశివరాత్రి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతం గుండా కాలినడకన శ్రీశైలం వెళ్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: