గుంటూరు జిల్లా బాపట్లలో జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. గుంటూరులోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒక జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరైనట్లు గుర్తు చేశారు. దానికోసం 1048కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్రం కోరితే.. గత ప్రభుత్వం కేవలం రూ.250కోట్లతో ప్రతిపాదనలు పంపిందన్నారు. కేంద్రం రూ. 133కోట్లు నిధులు మంజూరు చేస్తే ఇప్పటి వరకూ రూ.88కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. అసలు ఎలాంటి వనరులు, సదుపాయాలు లేని లాంలో ఎందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారో గత ప్రభుత్వానికే తెలియాలన్నారు.
అన్ని సౌకర్యాలు, పరిశోధనలకు అవసరమైన వనరులున్న బాపట్లలో జాతీయ స్థాయి యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ను కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు కోన రఘుపతి వెల్లడించారు. త్వరలోనే ఎన్జీ రంగా పేరిట బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం