Nara Lokesh on CRDA notices U1 Zone Farmers: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని U-1 జోన్ రైతులకు CRDA షాకిచ్చింది. జోన్ ఎత్తివేయడానికి 10 కోట్ల రూపాయలు చెల్లించాలని.. 381 మంది రైతులకు నోటీసులిచ్చింది. సీఆర్డీఏ నిర్ణయంపై రైతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటతప్పారంటూ మండిపడుతున్నారు. రైతుల ఆందోళన చేసిన సమయంలో.. ఫీజులు లేకుండా జోన్ తొలగిస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట ఇచ్చారని రైతులు చెబుతున్నారు. డబ్బులు చెల్లించాలంటూ.. సీఆర్డీఏ నోటీసులు ఇవ్వడంపై.. U-1 జోన్ రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
మండిపడ్డ లోకేశ్: మాట మార్చుడు, మడమ తిప్పుడులో జగన్‌ని మించిపోయాడు కరకట్ట కమల్ హాసన్ అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ రద్దు చేస్తున్నాం అంటూ హామీ ఇచ్చి తాడేపల్లి రైతుల్ని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
Farmer Padayatra: 70ఏళ్ల రైతు.. అమరావతికి మద్దతుగా.. 300కిలోమీటర్ల పాదయాత్ర
రైతులకు హామీ ఇచ్చిన లోకేశ్: రైతులు ఆందోళన పడొద్దన్న లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ రద్దు చేస్తామని, ఈ లోపు తొందర పడి డబ్బులు కట్టొద్దని తెలిపారు. యూ1 జోన్‌పై సీఆర్డీయే ఆదేశాలను ఈ సందర్భంగా లోకేశ్ బయటపెట్టారు.
యూ-1 జోన్ అంటే..: గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి మండలంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్‌గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగకుండా నిషేధం విధించారు. దీనిని రిజర్వ్ జోన్‌గా ప్రకటించి.. ఇందులో వ్యవసాయం తప్ప ఇతర కార్యకలాపాలకు ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో.. అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్‌ను సైతం కలిశారు. దీనిపై హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కాస్తా.. సీఆర్డీఏ అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వడంతో.. షాక్‌లో ఉన్నారు.
ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై లోకేశ్ విమర్శలు: మంగళగిరిని మోసం చేసిన మోసగాడు ఆళ్ల రామకృష్ణ.. దోపిడీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మించిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో సహజ వనరుల దోపిడీ ద్వారా వందల కోట్లు కొట్టేశాడని ఆరోపించారు. రెండు సార్లు గెలిపించిన నియోజకవర్గానికి మేలు చెయ్యకపోగా ఉన్న సహజ వనరులు యథేచ్ఛగా దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు.
ఉండవల్లి కొండకి గుండు కొట్టాడని, కాజా చెరువులో మట్టి దోపిడి, గిరి ప్రదక్షణ పేరుతో మట్టి దోపిడి చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఏకంగా నీరుకొండ క్వారీ వాటాల్లో తేడా వచ్చి వైసీపీ నాయకులు నడి రోడ్డు మీద తలలు పగలుగొట్టుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ఆళ్ల రామకృష్ణ.. దోపిడి, దౌర్జన్యాలకు అడ్డాగా మార్చేశారని లోకేశ్ ఆరోపించారు.