LOKESH FIRES ON YSRCP GOVT : విశాఖలో రోజుకో కుంభకోణం బయటపడుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. విశాఖలో ఇద్దరు ఎంపీల మధ్య లావాదేవీలలో తలెత్తిన వివాదం వల్లే విశాఖలో భూ అక్రమాలు ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సంజీవని వైద్య కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. అంతకుముందు శ్రీరాధాకృష్ణా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెదేపా అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో తమ సొంత నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెళ్లి కానుకలు, పండుగ బహుమతులు, గ్రావెల్ రహదారులు, అన్న క్యాంటీన్, ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
మంగళగిరి అభివృద్ధిపై శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకేశ్ 8 ప్రశ్నలు సంధించారు. మంగళగిరి అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను బాధ పెట్టిన ఏ నాయకుడూ అభివృద్ధిలోకి రాలేదని హితవు పలికారు. వైకాపా ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పులేదని లోకేశ్ చెప్పారు. తన తల్లి, భార్యపై వైకాపా నాయకులు విమర్శలు గుప్పించినపుడు.. ఆ పార్టీ మంత్రులు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరితో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అక్రమంగా ఇసుక, మట్టి తవ్విన వారిపై అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి: