మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మృతిపై వైకాపా శవ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆనంద్‌బాబు మీడియాతో మాట్లాడారు. కోడెలను ఆయన కొడుకే హత్య చేసినట్లు ప్రచారం చేయడం దారుణమన్నారు. కోడెలపై అనేక తప్పుడు కేసులు పెట్టి... చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా క్షోభించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి, నిరంకుశ ధోరణిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కోడెల ఆత్మహత్య చేసుకోవటానికి తప్పుడు కేసులే కారణమని... దానిపై సీబీఐ విచారణ అడగటం తప్పా అని ప్రశ్నించారు. ఆత్మహత్యపై సీబీఐ విచారణ కోరలేదని స్పష్టం చేశారు. కోడెల కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నక్కా ఆనంద్ బాబు హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ... కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమన్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి కోడెలపై ద్రుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... 'ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగులను దగా చేశారు'