Nagoba Fair Started Today: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన నాగోబా జాతర తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశస్థులు నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ఈ నెల 17న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవతకు పూజలు చేసి కేస్లాపూర్‌లోని మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశస్థులు.. ఆ చెట్ల నీడలో గంగాజలంతో మూడురోజుల పాటు వివిధ సంప్రదాయ పూజలు చేశారు.
శనివారం ఉదయం అక్కడి నుంచి వెండి విగ్రహం, పూజా సామగ్రిని తీసుకొని డోలు, కాలికోమ్ వాయిద్యాలతో ప్రదర్శనగా ఆలయానికి చేరుకున్నారు. గంగాజలంతో ఆలయాన్ని శుభ్రపరిచి, నాగోబాకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా డోలు, కిక్రీ వాయిద్యాలతో ఆలయం మార్మోగింది. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలతోపాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లోని ఆదివాసీలు తరలివచ్చారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, పటేల్ మెస్రం బాదిరావు, పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకూ జాతర కొనసాగనుంది.
Nagoba jatara 2023: నాగోబా వ్రతం ఆచరిస్తున్న మెస్రం వంశీయులు కాలినడకన 15 రోజుల పాటు ప్రయాణించి, గోదావరి నది నుంచి మట్టి కుండల్లో నీళ్లు తెస్తారు. ఆ నీటిని పవిత్ర గంగాజలంగా భావిస్తారు. ప్రయాణ బడలిక తీరేందుకు కేస్లాపూర్ సమీపంలో మర్రిచెట్టు కింద సేదతీరుతారు. తుడుంమోతలు, సన్నాయి వాయిద్యాల మోగిస్తూ.. అర్ధరాత్రి నాగోబా దేవతను అభిషేకం చేయడంతో మహాక్రతువు ప్రారంభం కానుంది.
నాగోబా సన్నిధిలో బేటి పేరిట మొక్కు తీర్చుకుంటేనే..పెళ్లయిన మహిళలకు మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే కాలం చేసినవారికి మోక్షం లభిస్తుంది.మెస్రం వంశీయులు రూ. 5కోట్ల స్వచ్ఛంద విరాళాలతో నూతనంగా నిర్మించిన గర్భగుడిలో మహాపూజ క్రతువు జరగనుంది. కేస్లాపూర్ వేదికగా ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే అధికార దర్భార్ ఈనెల 24న జరగనుంది.
మెస్రం వంశీయుల సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు... పిల్లలైన... జీవిత చరమాంకంలోకి చేరుకున్న వృద్దులైన.. నాగోబా సన్నిధిలో అందరూ సమానులనే భావన కనిపిస్తుంది. ఎంత నిష్టతో పూజలు చేస్తే... జనావళికి అంత మేలు జరుగుతుందనేది మెస్రం వంశీయుల విశ్వాసంగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతోంది.
నాగోబా జాతర పూర్వ చరిత్ర: పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్‌లో ఉండే మేనమామ ఇంటికి బయల్దేరారు. వాళ్లను తన తండ్రి ఆదరించలేదనే కోపంతో చంపేందుకు వస్తున్నారనుకుంది ఆయన కూతురు ఇంద్రాదేవి. దాంతో ఆమె పెద్దపులిగా మారి ఆరుగురిని చంపేసింది. చివరివాడు నాగేంద్రుడిని వేడుకుని తప్పించుకున్నాడు. మెస్రం వంశీయులను కాపాడిన నాగేంద్రుడు నాగోబాగా వెలిశాడని భావించి వేడుక చేసుకున్నారు. అదే నాగోబా జాతర.
ఇవీ చదవండి: