ప్రభుత్వ పాఠశాలల్లో ఏళ్ల తరబడి సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వీటికి చరమగీతం పాడి పాఠశాలలను కొత్తగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం 'నాడు-నేడు' పథకం కింద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లాలో తొలి విడతగా 1,149 పాఠశాలలు నాడు-నేడు పథకం కింద ఎంపికయ్యాయి. గుత్తేదారులు లేకుండా ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాల తల్లిదండ్రుల నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలో పనుల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలు, భవనాల మరమ్మతులు, అదనపు భవనాల నిర్మాణం, ప్లోరింగ్, బెంచీలు, బోధన కోసం గ్రీన్ బోర్డులు, అల్మరాలు, ఫ్యాన్లు వంటివి కల్పించేందుకు ప్రణాళిక రూపకల్పన చేశారు. వీటికి 261.65 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేసి పనులు చేపట్టారు. ఈ పనుల నిర్వహణకు ఇప్పటివరకు 111.79 కోట్లను విడుదల చేశారు. ఇంకా 149.86 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. నిధుల లేమి, ఇసుక కొరత, సిమెంట్ సరఫరా కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.
నిధులు విడుదల కాక ఇబ్బందులు..
సెప్టెంబరు 5 నాటికి ఆయా పనులను పూర్తి చేయాలని, లేకుంటే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యులను చేస్తామని ఆదేశాలు జారీతో... కరోనా నేపథ్యంలోనూ పనులను నిర్వహించారు. కొన్ని పాఠశాలల్లో అంచనాలకు మించి పనులు చేపట్టారు. ఇలాంటి పాఠశాలల నుంచి ప్రభుత్వానికి నిధుల కోసం ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుతం బిల్లులు సమర్పిస్తుంటే యాప్ స్వీకరించడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. తమ జేబుల్లోంచి సొమ్ములు వెచ్చించి పనులు నిర్వహించిన ఉపాధ్యాయులు.... నిధులు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు.
త్వరలో విడుదల చేస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నేడు-నాడు పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయని... ఇంకా 15 నుంచి 20 శాతం పనులు మిగిలి ఉన్నాయని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారులు చెప్పారు. మిగిలిన నిధులను త్వరలో విడుదల కానున్నాయని సర్వశిక్షా అభియాన్ జిల్లా ఏపీసీ వెంకటప్పయ్య చెప్పారు.
పాఠశాలలు పున: ప్రారంభమైన తరుణంలో ప్రభుత్వం మిగిలిన నిధులను విడుదల చేసి పనులు పూర్తి చేయాలని.... అప్పుడే నాడు-నేడు కార్యక్రమం లక్ష్యం నేరవేరనుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీఎస్ఆర్టీసీకి కౌశలాచార్య అవార్డు