Manohar Comments On Jagan: జగనన్న శాశ్వత భూ సర్వే పేరుతో పాస్ పుస్తకాల్లో ముఖ్యమంత్రి జగన్ ఫొటో వేసుకోవడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్... తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తున్న భూమి పాస్ పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు.
పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు మానుకోవాలన్నారు. కాల్వల్లో పూడిక తియ్యలేరు కానీ పొలాల పాస్ పుస్తకాల్లో మాత్రం జగన్ ఫొటో ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 18న సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు. అన్నపూర్ణ లాంటి గుంటూరు జిల్లాలో 288 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమన్నారు. రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు.. రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని మనోహర్ వ్యాఖ్యానించారు. తెనాలి నియోజకవర్గంలో 7లక్షల 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే ప్రభుత్వం కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. రైతుల్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: