SPECIAL CS SRI LAKSHMI : రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేవలం ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించారని కేంద్రం చేసిన వ్యాఖ్యలను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తోసిపుచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గత మూడేళ్లలో లక్షన్నర ఇళ్లు నిర్మించామని శ్రీ లక్ష్మీ చెప్పారు. టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు పూర్తి చేసిన తర్వాతే లబ్ధిదారులకు వాటిని అందజేస్తామన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ టిడ్కో ఇళ్లల్లో సమస్యలున్నా.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 566 ఆరోగ్య కేంద్రాలకు గాను ఇంకా 22 మాత్రమే నిర్మించాల్సి ఉందని శ్రీలక్ష్మి తెలిపారు.
ఇదీ జరిగింది: ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్లలో గత మూడేళ్ల కాలంలో.. రాష్ట్రంలో కేవలం 5 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ లోక్‌సభకు నివేదించింది. 2019-20 నుంచి 2021-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా.. 97లక్షల 67 వేల 825 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. అత్యల్పంగా ఏపిలోనే నిర్మించారని వెల్లడించింది. అంతకుముందు 2016 నుంచి 2022 డిసెంబర్ 9వ తేదీ వరకు లక్షా 82 వేల 632 ఇళ్లు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు కాగా... అందులో 25 శాతం వరకు... 46వేల 726 పూర్తి అయ్యాయని తెలిపారు. లోకసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి తెలిపారు.
2016 నుంచి 2019 వరకు 46వేల 721 ఇళ్ల నిర్మాణం జరిగితే.. 2019-22 మధ్య కాలంలో కేవలం ఐదు ఇళ్ల నిర్మాణమే జరిగినట్లు వివరాల్లో పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా... ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ నాటికి.. 6928 హెక్టార్లలో పంట దెబ్బతినగా... ఏడుగురు మరణించారని, 291 పశువులు మృతి చెందగా... 13,573 ఇళ్లు దెబ్బతిన్నాయని మరోసభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా బదులిచ్చారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 1252.80 కోట్లు కేటాయించి.. తొలిదఫాగా 470 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.
ఇవీ చదవండి: