బీసీ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ (MP Mopidevi on BC Census) అన్నారు. బీసీ జనగణన చేపట్టాలని వైకాపా ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానం.. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ప్రధాన ఘట్టమన్నారు. సీఎం జగన్ బీసీల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.
బీసీ జనగణన కోసం అనేక ఉద్యమాలు జరిగాయని, దీనిపై గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్ణయాలు తీసుకుని పట్టించుకోలేదని ఆరోపించారు. సుమారు 200 వరకు ఉన్న బీసీ కులాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుంచాలనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
ప్రభుత్వ నామినేటేడ్ పోస్టుల్లో సగానికి పైగా బీసీలకు అవకాశం కల్పించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 95 సంవత్సరాల క్రితం బీసీ జనగణన జరిగిందని.. ఆ తరువాత ఇప్పుడు బీసీ జనగణన తీర్మానాన్ని జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వం మీది ఒత్తిడి తీసుకొచ్చి జనగణనపై సానుకూల నిర్ణయం తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంక్ కోసమే వాడుకున్నారని.. వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీసీ సామాజిక వర్గ అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. తెదేపా నేతలు బురదజల్లే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు. వైకాపా హయాంలో బీసీ వర్గాలకు జరిగిన అభివృద్ధిపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మోపిదేవి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
ap assembly: బీసీ కులాల జనగణన చేపట్టాలని తీర్మానం.. శాసనసభలో ఆమోదం