విభజన చట్టం ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. కేంద్రం నియమించిన కమిటీతోపాటు, వివిధ కమిటీల సిఫారసుల మేరకు రాజధానిపై నిర్ణయం జరిగిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుకు వ్యతిరేకంగా అమరావతిని నిర్ణయించారనేది అసంబద్ధమని కనకమేడల అన్నారు. 29 వేల మంది రైతులు, 33 వేల ఎకరాల భూమి రాజధాని నిర్మాణానికి ఇవ్వడం చారిత్రాత్మకమని... రాజధానిపై సామాజిక వర్గ ముద్రవేసి దానిని తగలబెట్టాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన రాజధానిని నాశనం చేయాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
ఎందుకు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారో సీఎం జగన్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని కనకమేడల డిమాండ్ చేశారు. రాజులు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకోవచ్చనేది చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. రాజధాని మార్పునకు సహేతుకమైన ఒక్క కారణమైనా చూపెట్టగలరా అని నిలదీశారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్ష ముందు నిలబడదని కనకమేడల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ప్రజాధనాన్ని వృథా చేయడం మానాలని అన్నారు. .
ప్రాథమిక హక్కులకు రక్షణలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని కనకమేడల అన్నారు. న్యాయస్థానాల తీర్పులను సైతం విమర్శిస్తూ మంత్రులు న్యాయవ్యవస్థలను కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం న్యాయ వ్యవస్థ తీరుపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల