వెయ్యి రూపాయల విషయంలో తలెత్తిన చిన్న వివాదంతో మహిళా వాలంటీర్‌పై ఓ వ్యక్తి కొడవలితో దాడికి యత్నించాడు. గ్రామస్థులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం వెయ్యి రూపాయల సాయాన్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన బొల్లా సంజయ్ కుమార్ అనే వ్యక్తి దీనికి లబ్ధిదారుడు కాగా.... అతని కుమార్తెకు గ్రామ వాలంటీరు మీనాక్షి వెయ్యి రూపాయల నగదును అందజేశారు. అయితే తనకు ఇవ్వాల్సిన నగదును తన కుమార్తెకు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంజయ్ గ్రామ వాలంటీర్‌తో గొడవపడి కొడవలితో దాడి చేసేందుకు యత్నించాడు. గ్రామస్థులు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పజెప్పారు. దాడికి యత్నించిన సంజయ్ కుమార్.... వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అన్న కుమారుడు. బాధితురాలైన గ్రామ వాలంటీర్ మీనాక్షి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు.
ఇదీ చదవండి