గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ప్రభుత్వాసుపత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే విడదల రజిని భరోసా ఇచ్చారు. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రి తోపాటు టిడ్కో భవనంలో ఉన్న కొవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. కరోనా రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బెడ్లు, మందులు ఉన్నాయని, ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజిక్షన్లు సరిపడా అందితే ఏ ఇబ్బంది లేకుండా రోగులకు చికిత్స అందించవచ్చని వైద్యులు చెప్పారు.
వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ తో చికిత్స పొందుతున్న రోగులందరికీ తమ సొంత సంస్థ వీఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం ఉచితంగా అందజేస్తామన్నారు. కొవిడ్ మృతదేహాల తరలింపుకు ఉచితంగా వాహనాల ఏర్పాటు.. కరోనాతో చిలకలూరిపేటలో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాల తరలింపునకు పురపాలక సంఘం తరపున ఉచితంగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కరోనా మరణాలపై ఎమ్మెల్యే మాట్లాడుతుండగా మృతదేహాల తరలింపు విషయంలో బాధిత కుటుంబీకులు పడుతున్న ఇబ్బందులను నాయకులు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే.. పట్టణంలో కరోనాతో ఎవరైనా ఎక్కడైనా చనిపోతే... ఉచితంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: