రానున్న రోజుల్లో రాష్ట్ర విద్యావ్యవస్థలోకి డిజిటల్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కొత్త రాజాపేటలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన గురుకుల పాఠశాల భవనాలను ఎమ్మెల్యే విడదల రజినితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి సురేశ్.. భవిష్యత్తు అంతా డిజిటల్ రంగానిదేనని, విద్యా రంగంలో ఆన్‌లైన్ చదువులు కీలక పాత్ర పోషించబోతున్నాయని అన్నారు.
రాష్ట్ర విద్యా రంగంలో ప్రత్యేకంగా ఓటీటీలను అందుబాటులోకి తీసుకొచ్చి పిల్లలకు విద్యా బోధన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకనుగుణంగా వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి పథకంలో భాగంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విద్యా వ్యవస్థలో డిజిటల్ విప్లవం కొనసాగుతుందని.., విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తదితరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదవుతున్నాయన్నారు. మారుతున్న కాలానికి, విద్యా పద్ధతులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందన్నారు. దానిలో భాగంగా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకు ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ కేంద్రాల ద్వారా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
ఇప్పటికే ఆరో తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టి బోధన కొనసాగిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతూ 2024-25 నాటికి పదో తరగతి వరకు పూర్తిగా సీబీఎస్ఈ సిలబస్‌లోనే బోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఏపీఆర్‌జేసీకి సంబంధించి మరో పది పాఠశాలల వరకు సొంత భవనాలు లేవని, వచ్చే రెండేళ్లలో ఈ భవనాలను కూడా నిర్మిస్తామని అన్నారు. రెండేళ్ల తరువాత గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నిర్వహించే పరిస్థితి ఉండదన్నారు.
విద్యా రంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్ సరికొత్త విప్లవాన్ని సృష్టించారని ఎమ్మెల్యే రజిని కొనియాడారు. నాడు- నేడు, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద.. లాంటి పథకాల ద్వారా విద్యా రంగం వర్ధిల్లుతోందని అన్నారు.
ఇదీ చదవండి