MINISTER VIDADALA ARAJINI : రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు కింద 16వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మూడోసారి శంకుస్థాపన చేశారు. రేపటి నుంచే పనులు ప్రారంభించి 2025 కల్లా పూర్తి చేస్తామని జింఖానా ప్రతినిధులు తెలిపారు. 600 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి రజని తెలిపారు. నిర్మాణానికి పూర్వవిద్యార్థులు నిధులివ్వటం గర్వకారణమన్నారు.
గత ప్రభుత్వంలో జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందటం, కరెంటు పోతే వైద్యుల సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు చేసిన పరిస్థితి ఉండేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో జీజీహెచ్‌ను నాడు-నేడు కింద కూ.500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.8వేల కోట్లతో 17 వైద్యకళాశాలల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని.. క్యాన్సర్‌కు కూడా అత్యుత్తమ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి "భలే మంచిరోజు" అంటూ పాటపాడటం ఆసక్తి కలిగించింది. ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆగిపోయిన భవనాన్ని నిర్మించేందుకు గుంటూరు వైద్య కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం జింకానా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.86 కోట్లతో నిర్మించే ఈ భవనానికి పూర్వవిద్యార్థి డాక్టర్ గవిని ఉమ రూ.22 కోట్ల విరాళమిచ్చారు. దీంతో ఈ బ్లాక్‌కు ఉమ భర్త కానూరి రామచంద్రరావు పేరు పెట్టారు.
ఇవీ చదవండి: