గత ప్రభుత్వ హయాంలో వైద్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రావు విమర్శించారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన 108,104 వాహనాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ సరిగా లేకపోయినా పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్.. 1088 నూతన అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారని కొనియాడారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు.
ప్రజా సంక్షేమం కోసం పాటు పడటంలో తండ్రిని మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారన్నారు. వెయ్యికి పైగా అంబులెన్స్‌లను ప్రారంభించి దేశంలోనే ఒక నూతన ఒరవడికి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని వైద్య రంగానికి మరల నూతన శోభ తీసుకొచ్చేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని ముందుంచాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని...ఇందుకోసం ఇప్పటికే సుమారుగా 9 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని మోపిదేవి వెంకటరమణ రావు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 1322 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులు